కేంద్ర స్థాయిలో లోక్‌సభ, రాజ్యసభల మాదిరిగానే రాష్ట్రస్థాయిలో శాసన సభ, శాసన మండలిని ఏర్పాటు చేశారు. శాసన మండలినే విధాన పరిషత్‌ అంటారు. రాష్ట్రస్థాయిలో ద్విసభా విధాన ఏర్పాటు ఐచ్ఛికాంశం కావడం వల్ల అన్ని రాష్ట్రాలూ విధాన పరిషత్‌ను ఏర్పాటు చేసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో 1985లో విధాన పరిషత్‌ను రద్దు చేశారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ చొరవతో తిరిగి 2007లో మండలి మనుగడలోకి వచ్చింది..

రాష్ట్ర శాసనసభ (విధాన సభ - విధాన పరిషత్‌)




మనదేశంలో కేంద్ర స్థాయిలో ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో ద్విసభా విధానాన్ని ఐచ్ఛిక అంశంగా నిర్ణయించారు. దేశంలో తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని 1935లో ప్రవేశపెట్టారు.
రాజ్యాంగంలోని ఆరో భాగంలో 168 నుంచి 212 వరకు ఉన్న ప్రకరణల్లో రాష్ట్ర శాసన సభ నిర్మాణం, అర్హతలు, ఎన్నిక పద్ధతి, అధికార విధులు తదితర అంశాల గురించి పేర్కొన్నారు.

రాష్ట్ర శాసన సభ నిర్మాణం: 168వ ప్రకరణ రాష్ట్ర శాసనసభ నిర్మాణం గురించి తెలుపుతుంది. శాసనసభలో రాష్ట్ర గవర్నర్, ఎగువ సభ, దిగువ సభలుంటాయి. రాష్ట్ర గవర్నర్‌ శాసన సభలో సభ్యుడు కానప్పటికీ, శాసన సభలో అంతర్భాగమే.

రాష్ట్ర ఎగువసభ (విధాన పరిషత్‌)

విధాన పరిషత్‌ ఏర్పాటు, రద్దు ప్రక్రియ గురించి ప్రకరణ 169(1) తెలుపుతుంది. దీని ప్రకారం రాష్ట్ర దిగువ సభ (విధాన సభ) 2/3వ వంతు మెజారిటీతో ఒక ప్రత్యేక తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని పార్లమెంటు ధ్రువీకరిస్తే రాష్ట్రపతి ఎగువ సభను ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు.

ద్విసభా పద్ధతి అమల్లో ఉన్న రాష్ట్రాలు

  • ఉత్తరప్రదేశ్‌
  • ఆంధ్రప్రదేశ్‌
  • మహారాష్ట్ర
  • తెలంగాణ
  • బిహార్‌
  • కర్ణాటక

వివరణ:

  • ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా 1957లో విధాన పరిషత్‌ ఏర్పాటైంది. 1985లో దీన్ని రద్దు చేశారు. తిరిగి 2005లో వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం శాసనమండలిని పునరుద్ధరించింది. 2007 నుంచి అమల్లోకి వచ్చింది.
  • 1956లో ఏడో రాజ్యాంగ సవరణ ద్వారా మధ్యప్రదేశ్‌లో ఎగువ సభను ఏర్పాటు చేస్తూ చట్టం చేశారు. కానీ, అది ఇంతవరకు అమల్లోకి రాలేదు. 1986లో తమిళనాడు, 1969లో పంజాబ్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు ఎగువ సభను రద్దు చేశాయి.
  • మరోసారి ఎగువ సభ ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వం 2010లో తీర్మానం చేసింది. ఆ సమయంలో డీఎంకే అధికారంలో ఉంది. విధాన పరిషత్‌ ఏర్పాటు వాస్తవరూపం దాల్చేలోపు 2011లో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జయలలిత ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తూ మరో తీర్మానం చేసింది.

రాష్ట్ర ఎగువ సభ నిర్మాణం

ప్రకరణ 171లో రాష్ట్ర విధాన పరిషత్‌ నిర్మాణం గురించి పేర్కొన్నారు. ఎగువ సభలో ఉండాల్సిన కనిష్ట సభ్యుల సంఖ్య 40. అలాగే రాష్ట్ర విధానసభ లో మూడో వంతు కంటే మించకూడదు.

ఎన్నిక పద్ధతి: విధాన పరిషత్‌ సభ్యులను ప్రత్యక్ష, పరోక్ష ఓటర్లు ఎన్నుకుంటారు. విధాన పరిషత్‌ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఓటు బదలాయింపు ప్రక్రియ ద్వారా ఎన్నికవుతారు.
  • ప్రకరణ 171(3)(ఎ) ప్రకారం 1/3వ వంతు సభ్యులను స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు.
  • ప్రకరణ 171(3)(బి) ప్రకారం 1/12వ వంతు సభ్యులను పట్టభద్రులు ఎన్నుకుంటారు.
  • ప్రకరణ 171(3)(సి) ప్రకారం 1/12వ వంతు సభ్యులు ప్రభుత్వ ఉపాధ్యాయులచేత ఎన్నికవుతారు.
  • ప్రకరణ 171(3)(డి) ప్రకారం మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు సభ్యులను ఆ రాష్ట్ర విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు.
  • ప్రకరణ 171(3)(ఈ), 171(5) ప్రకారం మిగతా 1/6వ వంతు సభ్యులను గవర్నర్‌ నామినేట్‌ చేస్తారు. వీరు కళలు, సాహిత్యం, సంఘ సేవ, సహకార, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిష్ణాతులై ఉండాలి.

వివరణ: పైన తెలిపిన నిర్మాణం తాత్కాలికమైందే. పార్లమెంటు ఒక చట్టం ద్వారా మార్పులు చేయవచ్చు. అలాగే ఎవరికి ఓటు హక్కు కల్పించాలనే అంశం పై రాష్ట్ర శాసన సభ చట్టాలు చేయవచ్చు.
 
ఉదా: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో స్థానిక సంస్థల సభ్యులచేత ఎన్నికయ్యే ఎమ్మెల్సీల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్, పంచాయతీ వార్డు సభ్యులకు ఓటు హక్కు లేదు. కానీ కర్ణాటకలో ఓటు హక్కు ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కాలానుగుణంగా వీటికి మార్పులు చేయవచ్చు. పైన ప్రస్తావించిన అర్హతలు, పరిమితులు తాత్కాలికమైనవే.
ఎగువ సభ ఏర్పాటు, రద్దుకు సంబంధించి జాతీయ విధానాన్ని అనుసరించాలని మోదీ ప్రభుత్వం ప్రతిపాదించింది.

పదవీ కాలం: 

విధాన పరిషత్‌ శాశ్వత సభ. రద్దు చేయడం కుదరదు. కానీ అబాలిష్‌ చేయవచ్చు విధానపరిషత్‌ సభ్యులు ఆరేళ్ల కాలవ్యవధికి ఎన్నికవుతారు. రెండేళ్లకోసారి 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు.

అర్హతలు: 

ప్రకరణ 173 ప్రకారం, విధాన పరిషత్‌కు పోటీచేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు...
  • భారతీయ పౌరుడై ఉండాలి
  • 30 ఏళ్ల పైబడిన వయసు ఉండాలి.
  • ఆదాయం పొందే ప్రభుత్వ పదవిలో ఉండరాదు.
  • నేరారోపణ రుజువై ఉండరాదు.
  • పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు ఉండాలి.
గమనిక: శాసనమండలి ఎన్నికల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు.


రాష్ట్ర విధానసభ

ప్రకరణ 170(1) ప్రకారం రాష్ట్ర విధానసభలో కనిష్టంగా 60 మంది సభ్యులు ఉండాలి. గరిష్టంగా 500కి మించకూడదు.
వివరణ: రాష్ట్ర విధాన సభలో ఆంగ్లో ఇండియన్లకు తగిన ప్రాధాన్యం లేదని గవర్నర్‌ భావిస్తే ప్రకరణ 333 ప్రకారం ఆ వర్గానికి చెందిన ఒకరిని విధాన సభకు నామినేట్‌ చేయవచ్చు. మౌలిక రాజ్యాంగంలో గవర్నర్‌ నిర్ణయించిన సంఖ్యలో ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేస్తారనే పదం ఉండేది. 1969లో 23వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్‌ చేసేలా దాన్ని మార్పు చేశారు.
  • రాజ్యాంగంలో నిర్ణయించిన కనిష్ట సభ్యుల సంఖ్య 60 కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు.. సిక్కిం-32, మిజోరాం-40, గోవా - 40.
  • కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీ(70), పుదుచ్చేరి(30)ల్లో మాత్రమే విధానసభ అమల్లో ఉంది.

ఎన్నిక: 

ప్రకరణ 170(1) ప్రకారం రాష్ట్ర విధానసభ సభ్యులు ప్రాదేశిక నియోజక వర్గాల ప్రతిపాదికన సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. దీన్నే మెజార్టీ ఓటు అంటారు.దీన్నే సాంకేతికంగా ఫస్ట్‌ పాస్ట్‌ ది పోస్ట్‌ పద్ధతి అంటారు.(లోక్‌సభ సభ్యులను కూడా ఈ విధానంలోనే ఎన్నుకుంటారు.)ఇందుకోసం రాష్ట్రాన్ని జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాలుగా విభజిస్తారు.

పదవీకాలం: 

విధానసభ సభ్యుల పదవీకాలం ఐదేళ్లు. శాసనసభ సాధారణ పదవీకాలం కూడా ఐదేళ్లే. ప్రకరణ 172 ప్రకారం ఐదేళ్ల కంటే ముందే ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్‌ శాసనసభను రద్దు చేయవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు విధానసభ పదవీ కాలాన్ని ఒక ఏడాది వరకు పొడిగించే అధికారం పార్లమెంట్‌కు ఉంది. అయితే అత్యవసర పరిస్థితి ఎత్తేసిన తర్వాత ఆరు నెలల కంటే ఎక్కువగా పొడిగించడానికి వీల్లేదు.

అర్హతలు: 

ప్రకరణ 173 ప్రకారం విధానసభకు పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతలు..
  • భారత పౌరుడై ఉండాలి.
  • 25 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండరాదు.
  • ఆదాయాన్ని పొందే ప్రభుత్వ పదవుల్లో ఉండరాదు.
  • నేరారోపణ రుజువై ఉండరాదు.
  • పార్లమెంట్‌ నిర్ణయించిన ఇతర అర్హతలు కూడా ఉండాలి.

సమావేశాలు: 

ప్రకరణ 174 ప్రకారం రాష్ట్ర శాసనసభ ఏడాదిలో కనీసం రెండుసార్లు సమావేశం కావాలి. అయితే ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య వ్యవధి ఆరు నెలల కంటే మించరాదు. సమావేశాల సంఖ్యపై గరిష్ట పరిమితి లేదు. ప్రస్తుతం శాసన సభ ఏడాదికి మూడు పర్యాయాలు సమావేశమవుతోంది. అవి:
  • బడ్జెటు సమావేశం: ఫిబ్రవరి-ఏప్రిల్‌
  • వర్షాకాల సమావేశం: జూలై-ఆగష్టు
  • శీతాకాల సమావేశం: నవంబర్‌- డిసెంబర్‌

పై మూడు సందర్భాలు కలిపి, గరిష్టంగా 50 నుంచి 60రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి, మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్ర గవర్నర్‌ శాసన సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అలాగే శాసన సభ సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేస్తారు, రద్దు చేస్తారు.

కోరమ్‌: 

ప్రకరణ 189(3) ప్రకారం, రాష్ట్రశాసన సభలో సమావేశాలకు హాజరు కావాల్సిన కనిష్ట సభ్యుల సంఖ్య మొత్తం సభ్యుల్లో 1/10 వ వంతు లేదా 10. వీటిలో ఏది ఎక్కువైతే దాన్ని తీసుకుంటారు.


గతంలో అడిగిన ప్రశ్నలు

1. కింది వాటిలో శాసనమండలి లేని రాష్ట్రం ఏది?
ఎ) మహారాష్ట్ర
బి) రాజస్థాన్‌
సి) కర్ణాటక
డి) బిహార్‌

స‌మాధానం: బి


2. రాష్ట్ర శాసనసభలో ఏ రాజకీయ పక్షానికీ మెజార్టీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికకు గవర్నర్‌ ప్రధానంగా పరిశీలించవలసిన విషయం?
ఎ) స్థిరమైన మెజార్టీ పొందే అవకాశమున్న యోగ్యుడైన వ్యక్తిని వెతకడం
బి) రాష్ట్ర శాసన సభలో అతి పెద్ద రాజకీయ పార్టీ
సి) పార్టీలతో ఏర్పడ్డ అతిపెద్ద కూటమి
డి) పార్టీ కార్యక్రమానికి దాని సభ్యుల విధేయత

స‌మాధానం: ఎ


3. భారతదేశంలోని రాష్ట్రాల్లో ఆగంతుక నిధి ఎవరి నియంత్రణలో ఉంటుంది?
ఎ) గవర్నర్‌
బి) రాష్ట్ర ఆర్థిక మంత్రి
సి) ముఖ్యమంత్రి
డి) మంత్రిమండలి

స‌మాధానం: ఎ


4. రాష్ట్ర శాసనాలు రద్దుచేసే అధికారం ఎవరికి ఉంది?
ఎ) ముఖ్యమంత్రి
బి) రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల ఆమోదం, పార్లమెంటు ఆమోదం
సి) ప్రధానమంత్రి
డి) రాష్ట్రపతి

స‌మాధానం: బి

మాదిరి ప్రశ్నలు


1. రాష్ట్ర ఎగువ సభకు, దిగువ సభకు ఈ కింది ఏ అంశంలో పోలికలు ఉన్నాయి?
ఎ) నిర్మాణం
బి) పదవీ కాలం
సి) అధికారాలు
డి) పైవేవీ కాదు

స‌మాధానం: డి


2. రాష్ట్ర ఎగువ సభ సభ్యులు ఎన్నికయ్యేది?
ఎ) ప్రత్యక్షంగా
బి) పరోక్షంగా
సి) ప్రత్యక్షం, పరోక్షం
డి) అందరూ నామినేట్‌ అవుతారు

స‌మాధానం: సి


3. ఈ కింది ఏ సభలకు కనిష్ట, గరిష్ట సభ్యుల సంఖ్య పరిమితి ఉంది?
ఎ) విధాన సభ
బి) విధాన పరిషత్‌
సి) లోక్‌సభ
డి) పైవన్నీ

స‌మాధానం: డి


4. ఈ కింది ఏ సభ రద్దు విషయంలో ఆ సభకు ప్రమేయం ఉండదు?
ఎ) విధాన పరిషత్‌
బి) రాజ్య సభ
సి) లోక్‌సభ
డి) ఎ, బి

స‌మాధానం: ఎ


5. ఈ కింది ఎన్ని రాష్ట్రాల విధాన సభ సభ్యుల సంఖ్య సమానంగా ఉంది?
ఎ) 5
బి) 6
సి) 7
డి) 8

స‌మాధానం: డి


Previous Post Next Post