అతిగా సెల్‌ఫోన్‌ వాడకంతో వింత జబ్బులు! - Beware of Using Cell Phones
అతిగా సెల్‌ఫోన్‌ వాడకంతో వింత జబ్బులు!
కరోనా అంతుచిక్కని మహమ్మారి అనుకుంటే... డిజిటల్‌ అడిక్షన్‌ అనేది మరిన్ని కొత్త జబ్బులకు కారణం అవుతోంది. లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన యువత సెల్‌ఫోన్ల వీక్షణలో ప్రపంచమే మరిచిపోతోంది. గంటల తరబడి యూట్యూబ్‌, సోషల్‌ మీడియా, ఓటీటీలను చూస్తూ... ఒక రకమైన వ్యసనానికి లోనైంది. దీనివల్ల నరాలు, కండరాలకు సంబంధించిన కొత్త జబ్బులు వస్తున్నాయని చెబుతున్నారు వైద్యులు. అలాంటి వింత రుగ్మతల్లో కొన్ని.. 

అతిగా సెల్‌ఫోన్‌ వాడకంతో వింత జబ్బులు! - Beware of Using Cell Phonesస్మార్ట్‌ఫోన్‌ పింకీ

ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్ల సైజులు మారిపోయాయి. పెద్ద పెద్ద ఫోన్లు వస్తున్నాయి. వాటిని అరచేతిలో పట్టుకొనేటప్పుడు ఫోన్‌ కింద చిటికెన వేలుతో నొక్కి పట్టుకోవడం సహజం. కానీ అలా గంటల తరబడి చిటికెన వేలు మీద భారం పడటం వల్ల, వేలు వంకరపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు నిపుణులు. ‘ఫోన్‌ వల్ల మా వేలు వంకరపోయిందోచ్‌’ అంటూ అప్పట్లో చాలామంది తమ వేళ్లని ఫోటో తీసి మరీ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ రోగాన్ని ఇంకా నిర్థారించనప్పటికీ... రోజుకి ఆరుగంటలకు మించి చిటికెన వేలు మీద భారం పడితే వేలు వంకరపోయే ప్రమాదం లేకపోలేదంటున్నారు వైద్యులు.
టెక్స్ట్‌ నెక్‌
ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో కూర్చున్న ప్రయాణికుల్ని చూడండి.. అందరూ ఫోన్లను చూస్తూ నిమగ్నమై ఉంటారు. మరీ ముఖ్యంగా కుర్రకారు అయితే తీక్షణంగా తలలు వంచి ఫోన్లలో ఏదో టైప్‌ చేస్తూ కనిపిస్తారు. ఇలా తల, భుజాన్ని గంటల తరబడి వంచడం వల్ల వస్తున్న సమస్యే టెక్స్ట్‌ నెక్‌. వెన్ను పైభాగం, భుజాలలో తీవ్రమైన నొప్పి రావడం దీని లక్షణం. దీన్ని కనుక అశ్రద్ధ చేస్తే చిన్న వయస్సులోనే కీళ్ల సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను తలకి సమాంతరంగా ఉంచి వాడటం, మధ్యమధ్యలో చూపుని స్ర్కీన్‌ నుంచి తప్పించడం లాంటి చిట్కాలతో ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు. ఎవరన్నా వింటే బాగుండు!. బ్లాక్‌బెరీ థంబ్‌
అప్పట్లో బ్లాక్‌బెరీ ఫోన్‌ అంటే గొప్ప క్రేజ్‌. త్వరగా టైప్‌ చేసుకోవడానికి వీలుగా ఉండే క్వెర్టీ కీపాడ్‌ ఈ ఫోన్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. బొటనవేలు ఉపయోగించి ఆ కీపాడ్‌తో తెగ మెసేజులు పంపేవారు. కానీ అలా వత్తీ వత్తీ బొటనవేలు నరాలు దెబ్బతింటున్నాయని తెలిసింది. ఇలా అతిగా ఫోన్‌ కీపాడ్‌ వాడటం వల్ల వచ్చే వ్యాధికి ‘బ్లాక్‌బెరీ ఽథంబ్‌’ అని పేరు పెట్టారు. ముంజేతి దగ్గర వాపు, భరించలేని నొప్పి రావడం ఈ వ్యాధి లక్షణం. ఒకోసారి సర్జరీ చేస్తే కానీ నయం కాని పరిస్థితులు రావచ్చు. దీనికి ఆండ్రాయిడ్‌ థంబ్‌, స్మార్ట్‌ఫోన్‌ థంబ్‌ లాంటి ముద్దు పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్‌ బెరీ ఫోన్లు తగ్గిపోయాయి కాబట్టి... ఆ సమస్య కూడా అరుదుగా వస్తోందట.
సెల్‌ఫోన్‌ ఎల్బో
ల్యాండ్‌ఫోన్ల కాలంలో ప్రతి సెకనుకీ లెక్క ఉండేది. ఇప్పుడంతా అన్‌లిమిటెడ్‌ ఆఫర్ల మయం. నచ్చినవాళ్లతో నచ్చినంతసేపు కబుర్లు చెప్పుకోవచ్చు. కానీ మీరెప్పుడన్నా ఓ విషయం గమనించారా? చాలాసేపు ఫోన్‌ మాట్లాడాక మోచేయి దగ్గర కాస్త నొప్పి పెడుతుంది. మోచేతిని ఎక్కువసేపు మడిచి ఉంచినప్పుడు అక్కడ ఉండే ‘అల్నర్‌‘ అనే నరం మీద ఒత్తిడి కలగడమే ఇందుకు కారణం. ఇది క్రమంగా సెల్‌ఫోన్‌ ఎల్బోకు దారితీస్తుంది. మోచేయి నుంచి అరచేయి వరకు నొప్పి, మంట, స్పర్శ లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫోన్‌ మాట్లాడేటప్పుడు చేతులు మారుస్తూ ఉండటం, బ్లూటూత్‌ వాడటం లాంటి జాగ్రత్తలతో దీన్ని మొదట్లోనే నివారించవచ్చు. టెక్స్ట్‌ క్లా
కొత్తగా ఫోన్‌ కొనేవాళ్లు, ఆ ఫోన్లో ఎన్ని ఫీచర్లు ఉన్నాయో చూసుకుంటారే కానీ... ఫోన్‌ పట్టుకోవడానికి సౌకర్యంగా ఉందో లేదో గమనించరు. పొడవుగా, వెడల్పుగా ఉండే ఫోన్లు నిజానికి చేతిలో అంత తేలికగా ఇమడవు. అసహజమైన రీతిలో వాటిని గంటల తరబడి పట్టుకుని ఉండటం వల్ల చేతి కండరాలు దెబ్బతినే అవకాశం ఉంది. అదే టెక్స్ట్‌ క్లా! ఈ సమస్యని పట్టించుకోకపోతే... చిన్నపాటి వస్తువుని కూడా పట్టుకోలేనంత బలహీనంగా మన చేతి కండరాలు మారిపోతాయి. కొత్తగా ప్రచారంలోకి వచ్చిన సెల్‌ఫోన్‌ సమస్యల గురించి మాత్రమే చెప్పుకొన్నాం. వినికిడి లోపం, నిద్రలేమి లాంటి ఇతర అనారోగ్యాల గురించి చెప్పాలంటే... అబ్బో పెద్ద జాబితానే అవుతుంది. అందుకే ఏదైనా మితంగా వాడితేనే మంచిది. ఈ కరోనా లాక్‌డౌన్‌లో మీ ఫోన్లు, గాడ్జెట్స్‌కు మరింత అతుక్కుపోకుండా స్వీయనియంత్రణ పాటించాలి. అది మీ చేతుల్లోనే ఉంది మరి.

Post a Comment

Previous Post Next Post